ఇటీవలే భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనపై మోదీ మౌనం వీడాలని, ఆయన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని తొలిసారి స్పందించారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్నపలంగా ట్రంప్ కెనడా నుంచి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ప్రధాని మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌తో ప్రధాని తేల్చిచెప్పారు.
