చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. పాత్రికేయుల సమావేశంలో విక్రమ్ మాట్లాడుతూ పా రంజిత్ నా అభిమాన దర్శకుడు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ఇందులో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది అన్నారు.
బంగారం వేట చుట్టూ ఈ కథ నడుస్తుంది. అసమానతలకు గురైన ఓ తెగ స్వేచ్ఛ కోసం ఎలాంటి పోరాటం చేశారన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. తంగలాన్ అన్నది ఓ తెగ పేరు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. మేకప్ కోసం గంటల కొద్ది సమయం పట్టేది. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మరచిపోతాం.ఈ పాత్రను ఎంతగానో ఇష్టపడి చేశాను కాబట్టి షూటింగ్ జరిగిన ప్రతి రోజుని ఎంజాయ్ చేశాను. అవార్డులు నాకు ఇష్టమే కానీ, అంతకంటే ముఖ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి అన్నారు.
ఈ సినిమాలో తాను ఆరతి అనే పాత్రలో కనిపిస్తానని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవలకాలంలో రూపొందిన టఫెస్ట్ మూవీ ఇదేనని కథానాయిక మాళవిక మోహనన్ తెలిపింది. ఈ సినిమాలో దర్శకుడు పా రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారని మరో నాయిక పార్వతీ తిరువోతు పేర్కొంది. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.