అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి లో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తాజాగా ఇరాన్‌పై రెండో విడత వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియా లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే నౌకలకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపాం అని పేర్కొన్నది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. ఈ దాడులకు ముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బేకర్ ఖలీబాఫ్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరానియన్ల ఆధిపత్యాన్ని కొనసాగించడం తమ జాతీయ భద్రతలో భాగమని ఆయన స్పష్టం చేశారు.





























