భారతదేశంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, భారత సంతతికి చెందిన ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ ద్వారా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుండి దాదాపు 13 కోట్ల మంది (130 మిలియన్లు) ఓటర్ల పేర్లను తొలగించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న ఇండియాలో గంప గుత్తగా ఇంత పెద్ద మొత్తంలో పేర్లను తొలగించడాన్ని ప్రమిలా జయ్పాల్ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నం గా అభివర్ణించారు. అంతేకాదు అమెరికాలో ఓటర్ల హక్కులను కాలరాయడానికి గతంలో యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనుసరించిన వ్యూహాల తరహాలోనే ప్రస్తుతం భారతదేశంలో కూడా జరుగుతోందని ఆమె విమర్శించారు.

ప్రజాస్వామ్య వాదులు ఇలాంటి చర్యలను హర్షించబోరన్నారు. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఓటర్ల తొలగింపును నిరసిస్తూ ఢిల్లీ, ముంబై సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనలకు ఆమె తన పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా చేపట్టి ఎలాంటి చర్యలకైనా మద్దతు ప్రకటించాలని ఆమె పిలుపునిచ్చారు.















