రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేరడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు.


సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.“అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17వ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి అన్నారు. ఈ సందర్భంగా. ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, సంక్షేమం పథకాలను వివరించారు.
















