ఇండో అమెరికన్ ప్రఖ్యాత గణిత, సంఖ్యా శాస్త్రవేత్త కల్యాంపూడి రాధాకృష్ణరావు (సీఆర్ రావు) మరో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. గణిత నోబెల్‌గా పిలుచుకునే సంఖ్యాశాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారానికి ఆయనను ఎంపికచేసినట్టు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్ రావు వయస్సు 102ఏండ్లు. ఆయన గత 75 ఏండ్లుగా సంఖ్యాశాస్త్రంలో ఎంతో కృషి చేశారని, దీని ఫలితంగా వర్తక వాణిజ్యం, వైద్యం, ఆంత్రోపాలజీ, ఆర్థికశాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని ఫౌండేషన్ పేర్కొన్నది. సీఆర్ రావు ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. 2001లో పద్మ విభూషణ్‌ను ఆయన అందుకున్నారు. తెలుగు కుటుంబంలో జన్మించిన రావు తన చదువును ఏపీలోని గూడూరు, నూజివీడ్, నందిగామ, విశాఖపట్నంలో పూర్తి చేశారు.