Skip to main content

Namaste NRI

ఊరూవాడా కార్తీక పౌర్ణమి శోభ!

కార్తిక పౌర్ణమి పర్వదినం వేళ తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తిక దీపాలను నదుల్లో వదులుతూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవంబర్ 23 రాత్రి 11:42 గంటలకు మొదలైన పౌర్ణమి తిథి, ఇవాళ (నవంబర్ 24) రాత్రి 8:23 గంటల వరకు ఉండటంతో ఆలయాలకు భక్తుల తాకిడి రోజంతా కొనసాగుతోంది. తెలంగాణలో గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆలయాల వద్ద రద్దీ మరింత పెరిగింది.

తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, వేయిస్తంభాల గుడితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, అమరావతి, పాలకొల్లు పంచారామ క్షేత్రాలు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కేవలం ప్రముఖ పుణ్యక్షేత్రాలే కాకుండా ప్రకాశం జిల్లా కేతగుడిపి, ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం, ఖమ్మం జిల్లా నేరడ, కూసుమంచి ఆలయాల్లోనూ స్థానికులు పెద్ద ఎత్తున దీపారాధనలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఇక ఈ పవిత్ర దినాన అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘జ్వాలాతోరణం’ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా నిలిచే ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు ఆలయ ప్రాంగణాల్లో వేచి చూస్తున్నారు. దీపాల వెలుగులు, పంచాక్షరీ మంత్రోచ్ఛారణల మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events