అమెరికా, చైనాలు అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. అమెరికాలో జో బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టాక రెండు దేశాల మధ్య ఇలాంటి భేటీ జరగడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరు పక్షాలు అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితులను చర్చించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో చైనా సైన్యంలో అంతర్జాతీయ సైనిక సహకార విభాగం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హువాంగ్ షుపింగ్, అమెరికా సైనిక ఉన్నతాధికారి మేఖేల్ చేజ్ పాల్గొన్నారు. అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని చర్చల సందర్బంగా చైనా ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య అఫ్గాన్ ప్రస్తావన వచ్చినప్పటికీ అమెరికా దానిని నిర్లక్ష్యం చేసిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా, చైనా కలసికట్టుగా అఫ్గాన్ సమస్యపై దృష్టి సారిస్తే ఇరు దేశాలకు పెద్ద ప్రమాదమే తప్పిపోతుందని చైనా మిలటరీ భావిస్తోంది. ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్‌వెంట్ తిరిగి బలాన్ని పుంజుకొని విస్తరిస్తే చైనా సహా ఎన్నో దేశాలకు ప్రమాదమని, దీనిని అన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని అమెరికాను చైనా కోరినట్లు తెలుస్తోంది.