స్టార్ హీరో ధనుష్, మమితా బైజు జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కర. విఘ్నేశ్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, డా. ఐషరి కె. గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి హాజరై చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలో హీరో ధనుష్ మాట్లాడుతూ కర ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ తిరిగే అసాధారణ కథ అని, దర్శకుడు విఘ్నేశ్ రాజా తన మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పోరు తొళిల్ చూసిన తర్వాత ఆయనలోని ప్రతిభ నచ్చి ఈ సినిమా చేశానని, ఇది తప్పకుండా అద్భుతాలు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన స్నేహితుడు జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, మమితా బైజు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతూ, కుబేర, ఇడ్లీ కడై చిత్రాల కంటే ముందే కరతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. వేదికపైకి వచ్చిన సాయి దుర్గ తేజ్, వెంకీ అట్లూరి, బుచ్చిబాబులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, ధనుష్ సినిమాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన నిజజీవితంలోని ప్రేమకథలకు ధనుష్ పాటలకు విడదీయలేని సంబంధం ఉందని, రఘువరన్ బీటెక్ లో ఆయన పండించిన ఎమోషన్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయని కొనియాడారు. హీరోయిన్ మమితా బైజు తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాయి.





























