Skip to main content

Namaste NRI

గౌతమ్ అదానీ కేసులో… అమెరికా కోర్టు కీలక నిర్ణయం

బిలియ‌నీర్ గౌతమ్ అదానీ పై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా ఫెడ‌ర‌ల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తెలుపుతూ మరింత స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌ను కోర్టు ఆదేశించింది. బ్రూక్లిన్‌ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా, ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలు, కారణాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు. భారత్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదం కోసం ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని, అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూ వ‌స్తోంది.

Social Share Spread Message

Latest News