చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే వారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీకానున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఆ భేటీలో సమగ్రమైన భాగస్వామ్య, వ్యూహాత్మక సహకారం గురించి చర్చించనున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. పుతిన్ అందించిన ఆహ్వానం మేరకు మార్చి 20 నుంచి 22 వరకు జీ జిన్‌పింగ్ మాస్కోలో పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక డాక్యుమెంట్లపై సంతకాలు చేయనున్నారు. ఫ్రెండ్‌షిప్, పీస్ ఉద్దేశంతో ఆ ట్రిప్ సాగనున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొన్నది.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. కానీ పశ్చాత్య దేశాలు మాత్రం చైనాపై ఆగ్రహంగా ఉన్నాయి. డ్రాగన్ దేశం రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి.















