అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇండియాపై దాడికి కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. అది కూడా అమెరికాపై సెప్టెంబర్ 11న దాడికి ముందే ఇండియాలో కూడా దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు తేలింది. అమెరికాపై దాడి జరిగి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ, ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన కీలక వివరాల్ని వెల్లడించింది. 100 పేజీలకు పైగా ఉన్న నివేదికను విడుదల చేసింది.

1998 నుంచి సేకరించిన సమాచారం ఇది. బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఎ థ్రెట్ పేరుతో వచ్చిన ఈ నివేదిక ప్రకారం బిన్ లాడెన్ ఇండియాతోపాటు ఈజిప్ట్, అరేబియా దేశాలు, ఉగాండా వంటి పలు దేశాలపై దాడికి ప్లాన్ చేశాడు. 1998 సమయంలోనే ఈ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. అది కూడా అమెరికాపై దాడులకు ముందే. అయితే, ఇండియాలో ఎప్పుడు దాడి చేయాలనుకున్నాడు. ఎక్కడ, ఎలా దాడి చేయాలనుకున్నాడు వంటి అంశాల్ని ఈ నివేదికలో పేర్కొనలేదు.

2001లో సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌కు చెందిన ట్విన్ టవర్స్‌పై విమానాలతో అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది మరణించారు. 19 మంది హైజాకర్లు కూడా మరణించారు. అప్పటినుంచి లాడెన్ కోసం అమెరిగా గాలిస్తూనే ఉంది. చివరకు 2011, మే 2న పాకిస్తాన్లో దాక్కున్న లాడెన్‌ను అమెరికా సైన్యం చంపేసింది. దీంతో నెమ్మదిగా అల్ ఖైదా కార్యకలాపాలు స్తంభించాయి.















