అరవై ఒక్క ఏళ్ల వయస్సులో కఠోర శ్రమతో ఆమె అసాధారణ రికార్డు నెలకొల్పింది. ఏకధాటిగా ఐదుగంటలపాటు అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్ లో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమెనే కెనడా కు చెందిన మహిళ డోన్నాజీన్ వైల్డ్. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ఏదైనా సాధించాలనుకుంటే వయస్సు అడ్డుకాదని ఆమె నిరూపించారు.

హంట్స్‌మన్ వరల్డ్ సీనియర్ గేమ్స్‌లో భాగంగా జరిగిన ఈవెంట్‌లో ఆమె ఐదు గంటలు అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్‌లో ఉండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఫీట్‌తో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తన రికార్డును తానే బద్దలుకొట్టారు. ఈ ఏడాది మార్చిలో అల్బెర్టాలో 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్‌లో ఉండి ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ఐదుగంటల మార్కును చేరారు. స్టేజ్‌పై ఆమె ఏకాగ్రతతో ప్లాంక్ చేస్తుండగా 5 గంటల సమయం పూర్తికాగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో ఆమెను అభినందించారు. అనంతరం డోనాజీన్ చిరునవ్వుతో తన విజయాన్ని ఆస్వాదించారు.















