సిక్కింలోని నాథూలా పాస్ ద్వారా సాగే భారత్-చైనా బహిరంగ వాణిజ్యం మళ్లీ మొదలు కాబోతున్నది. ఆరేళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్నది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకోబోతున్నది.

పురాతన కాలం నుంచీ ప్రపంచ ప్రధాన వాణిజ్య మార్గంగా నిలిచిన సిల్క్ రూట్లో భాగమైన నాథూలా కనుమను 1962లో భారత్-చైనా యుద్ధం అనంతరం మూసివేశారు. 2006లో పునఃప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని తిరిగి ప్రారంభిస్తుండటం సిక్కింకు చెందిన వందల మంది స్థానిక వ్యాపారులకు, రవాణా సదుపాయాల నిర్వాహకులకు, అనుబంధ వ్యాపార కార్యకలాపాలకు ఎంతో మేలు చేయనుంది.





























