ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను నియంత్రించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటకు చెప్తున్నప్పటికీ, ఇరాన్‌పై అణుదాడులు ప్రారంభించడానికి రహస్యంగా సన్నద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో ఈ అణుదాడులు చేయడానికి ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందని ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ అణుదాడులవల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ఆయన చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలను ప్రయోగించిన విషయాన్ని టేలర్ గ్రీన్ గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లు గడిచినా జపాన్ ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ వ్యాధులు, క్యాన్సర్, పుట్టుకతో సంక్రమించే లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే పరిస్థితి ఇరాన్‌కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.















