Skip to main content

Namaste NRI

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టాటా గ్రూప్‌ AI డేటా సెంటర్ క్యాంపస్‌

టాటా గ్రూప్‌కు చెందిన TCS Hyper Vault హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించనుంది. తెలంగాణకు ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటం, ప్రపంచ ఏఐ మ్యాప్‌లో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే చారిత్రాత్మక పరిణామమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. TCS అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో Hyderabad గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి కోమటిరెడ్డివెంకటరెడ్డి, అడ్లురి పాల్గొన్నారు. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న , హైపర్ వాల్ట్ సీఈఓ, ఎండీ దీపేష్ నందా, అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు పాల్గొన్నారు.

ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో, ఆ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. Telangana Rising 2047 లో భాగంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అవుతుందని చెప్పారు.

హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ భారీ పెట్టుబడితో ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.

తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆశించిన విధంగా Bharat Future City అభివృద్ధికి బలమైన పునాది పడిందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News