Skip to main content

Namaste NRI

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో రాబోయే సంక్షోభంపై కార్యాచరణ ప్రణాళిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ 8 నెలలు ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.

రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే, మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేదన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సినిమా, మీడియా, కళాజాతాలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనావేసి, పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని, రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరిందని గుర్తుచేశారు.

దసరా తరువాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు.ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని, టోల్‌-ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు సీఎంఓ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events