రవితేజ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించారు. తన తదుపరి చిత్రంగా తులాభారం చేయబోతున్నారు. క్రైమ్ డ్రామాతో కూడిన ఈ వినోదాత్మక చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టగా, చందు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు శివ నిర్వాణ, బాబీ కలిసి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రబృందానికి వి.వి.వినాయక్ స్క్రిప్ట్‌ని అందజేశారు. సినిమా బాగా రావాలని, ఘన విజయం అందుకోవాలని అతిథులంతా ఆకాంక్షించారు. తులాభారం అనే టైటిల్‌ని విభిన్న తరహాలో వినోదాత్మకంగా విడుదల చేస్తూ ది టైటిల్ డాక్యుమెంటరీ వీడియోను దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించారు.

దీన్ని మై హోమ్ రామ్ విడుదల చేశారు. ఈ వీడియోలోనే ఈసినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేశారు. ఇందులో కృష్ణవేణిగా ప్రియాంక అరుళ్ మోహన్, సౌండ్‌గా అనస్వర రాజన్, శివాజీరావుగా జేడీ చక్రవర్తి, దేవరాజ్‌గా తరుణ్‌భాస్కర్, జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి అంటోని కనిపించనున్నారు. దశాబ్దాలుగా తనదైన ఎనర్జీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రవితేజ, ఈ సినిమతో సరికొత్త ఐడెంటిటీని సొంతం చేసుకోబోతున్నారని, ఇందులో ఆయన మాస్ మహారాజాకు బదులు క్రైమ్ మహారాజాగా పరిచయం అవుతారని, ప్రేక్షకులు ఆయన్ను పూర్తి భిన్నమైన అవతారంలో చూడబోతున్నారని మేకర్స్ తెలిపారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రానికి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: వివేక్ సాగర్.















