దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. సినిమాల్లోకి రావడానికి ముందు తన తల్లి శ్రీదేవి పెట్టిన కండిషన్లు, ఆమె ఇచ్చిన సలహాల గురించి తాజాగా వెల్లడించారు. అంతేకాదు, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. తొలుత తాను సినిమాల్లోకి వస్తానంటే తల్లి శ్రీదేవి పెద్దగా ఆసక్తి చూపించలేదని, అయితే ఆ తర్వాత తన నిర్ణయానికి మద్దతు ఇచ్చిందని తెలిపారు.

జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి ఎప్పటికప్పుడు పలు సందర్భాల్లో మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన కెరీర్‌కు సంబంధించి తల్లి ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని మొదట శ్రీదేవికి చెప్పానని, అయితే ఆమె వెంటనే అంగీకరించలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే సాధారణ విషయం కాదని, ఈ రంగంలోకి వస్తే జీవితాంతం నటనకే అంకితం కావాల్సి ఉంటుందని తన తల్లి చెప్పినట్లు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందని శ్రీదేవి తనకు వివరించినట్లు చెప్పారు. మొదట్లో తనపై తల్లికి అంతగా నమ్మకం ఉండేది కాదని కూడా జాన్వీ పేర్కొన్నారు.















