Skip to main content

Namaste NRI

హైదరాబాదులో “భాగ్యలక్ష్మి” నాణేల కోసం పోటెత్తిన భక్తులు

దీపావళి వేళ చారిత్రక చార్మినార్ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. అక్కడి ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఆదివారం సాయంత్రం ఆలయంలో ప్రతిష్టాత్మక అమ్మవారి ఖజానా నాణేల పంపిణీ ప్రారంభం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అమ్మవారి ఖజానా నుంచి ఇచ్చే ఆ ఒక్క నాణేన్ని ఇంటికి తీసుకెళ్లి పూజగదిలోనో, బీరువాలోనో దాచుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ విశ్వాసంతోనే నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది చార్మినార్‌కు తరలివస్తున్నారు.

ఆదివారం సాయంత్రం మొదలైన ఈ నాణేల పంపిణీ కోసం భక్తులు భారీగా బారులు తీరడంతో క్యూలైన్లు ఏకంగా గుల్జార్ హౌస్ వరకు విస్తరించాయి. భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ నిర్వాహకులు, దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి క్రమపద్ధతిలో నాణేలను అందజేస్తున్నారు.

ఈ ఖజానా నాణేల పంపిణీ మొత్తం మూడు రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. తొలి రోజే విపరీతమైన స్పందన రావడంతో, మిగిలిన రెండు రోజుల్లో భక్తుల తాకిడి మరింత తీవ్రంగా ఉండే అవకాశముంది. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో పండుగ వాతావరణం, ఆధ్యాత్మిక సందడి మరింత రెట్టింపవుతోంది

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events