సామాజిక సంస్కరణలతో చరిత్రకెక్కిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పూలే. ప్రతీక్‌గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. సుపదా క్రియేషన్స్ పతాకంపై డా॥ పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ జ్యోతిరావ్‌పూలే, సావిత్రిబాయి పూలే చరిత్రను నేటి మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు. పూలే దంపతులు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, మహిళా విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం వారు అలుపెరుగని పోరాటం చేశారని రచయిత పసునూరి రవీందర్, సామాజిక కార్యకర్త విమలక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.















