Skip to main content

Namaste NRI

రాజీవ్ గాంధీని చంపడానికే అలా చేశారా..? షాకింగ్ విషయాలు!

తమ కుటుంబంలోని ఎవరికీ తెలియని కీలక ఘట్టాలను, భావోద్వేగ క్షణాలను పంచుకుంటూ గాంధీ కుటుంబం విడుదల చేసిన 23 నిమిషాల ప్రత్యేక వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ నేపథ్యంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఒకే చోట కూర్చొని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను హత్య చేయడానికే, కావాలనే భద్రతను తొలగించారని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని రాహుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బిహార్ పర్యటనలో రాజీవ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగినప్పుడే, భద్రత పెంచకపోతే తండ్రి అంత్యక్రియలకు వెళ్లాల్సి వస్తుందని తాను ఇంట్లో ముందే హెచ్చరించానని రాహుల్ ఆనాటి భయానక పరిస్థితులను వివరించారు.

ఇదే సంభాషణలో ప్రియాంక గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో తాను పాఠశాలలో ఎదుర్కొన్న ఒక అవమానకర ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. స్కూల్‌లో ఒక బాలుడు తన దగ్గరకు వచ్చి “మీ బాబాయ్ దొంగ.. అందుకే జైల్లో ఉన్నాడు” అని హేళన చేయడంతో, తట్టుకోలేక ఆ అబ్బాయి చెంప చెళ్లుమనిపించానని ప్రియాంక వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తాను ఎప్పుడూ క్రమశిక్షణతో నిబంధనలు పాటిస్తూ ఉండేదానినని, కానీ రాహుల్ మాత్రం తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా వ్యవహరించేవాడని తమ ఇద్దరి భిన్నమైన వ్యక్తిత్వాల గురించి ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.

మరోవైపు 2004లో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు తాను ప్రధానమంత్రి పదవిని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో సోనియా గాంధీ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. సాధారణంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పదవిని అంటిపెట్టుకుని ఉండటానికే కారణాలు వెతుక్కుంటారని, కానీ తాను మాత్రం ఆ పదవిని వద్దనుకున్నానని ఆమె స్పష్టం చేశారు. అయితే, తనను ప్రధానిగా చూడాలని ఆశపడిన కోట్లాది మంది ప్రజలకు తాను అన్యాయం చేశానేమో అన్న భావన ఇప్పటికీ తన మనసులో ఉందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత పోరాటాలు, అనారోగ్య సమస్యలతో పాటు, తన పిల్లలు రాహుల్, ప్రియాంకల జ్ఞాపకాలు తోడవ్వడం వల్లే ఈ పుస్తకానికి అసలైన పరిపూర్ణత వచ్చిందని ఆమె ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events