పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని మోదీతో టీవీ చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ఆర్టీ టెలివిజన్ నెట్‌వర్క్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మోదీతో టీవీలో చర్చకు ఇష్టపడతాను అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య విభేదాలు చర్చలతో పరిష్కారమైతే భారత ఉపఖండంలోని కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే విధంగా 2018 పాకిస్థాన్ ఎన్నికల్లో మా పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికారంలోకి రాగానే కశ్మీరే మా సమస్య కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా తక్షణం ఆ సమస్యను పరిష్కరించుకుందామని భారత నాయకత్వాన్ని కోరా అని తెలిపారు. భారత్ గురించి ఇతరులు చాలా మంది కంటే తనకు బాగా తెలుసని, పాక్ క్రికెట్ ఆటగాడిగా భారత్‌లోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కశ్మీర్‌పై తన ప్రతిపాదనకు భారత్ నుంచి సానుకూల స్పందన రాలేదని విచారణ వ్యక్తం చేశారు.
2016 పఠాన్ కోట్ దాడి అనంతరం ఇండో `పాక్ సంబంధాలు దిగజారాయి. 2019 సర్జికల్ స్ట్రైక్స్‌తో ఈ బంధం మరింత క్షీణించింది. కశ్మీర్‌కు భారత్ ప్రత్యేక హోదా తదితరాలను ఉపసంహరించుకోవడం పాకిస్థాన్‌కు నచ్చలేదు. రెండు దశాబ్దాల అనంతరం తొలిసారి పాక్ ప్రధాని రష్యాలో పర్యటిస్తారు.














