బతుకమ్మ పండుగ మరింత వైభవంగా నిర్వహించడానికి డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్) సిద్ధమవుతున్నది. దసరా (విజయదశమి) వేడుకలు జరిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది సుమారు 16 వేల మందితో మహా సంబురంగా, మరింత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించడానికి టీ-పాడ్ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
అక్టోబర్ ఒకటో తేదీన కొమెరికా ఈవెంట్ సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా) వేదికగా నిర్వహించే బతుకమ్మ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలు.. ఒక్లహామా, కాన్సాస్, అర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్ ఈవెంట్ సెంటర్‌లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలకు కాలిఫోర్నియా నివాసి,హెల్త్‌కేర్ మొఘల్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డి, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తన మద్దతు ప్రకటించారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు జరుపుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలందిస్తామని తెలిపారు.














