దుబాయ్‌లో హిందువుల కోసం ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించిన దేవాలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది. దుబాయ్‌లోని జెబెల్‌అలీలో నిర్మించిన ఈ దేవాలయానికి ప్రత్యేకతలున్నాయి. ఈ దేవాలయాని దుబాయ్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ప్రారంభించారు. 9 మతపరమైన పుణ్యక్షేత్రాలను కలిపి ఆరాధాన గ్రామం పేరుతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 16 దేవతా విగ్రహాలుండగా, శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. మందిరంలో మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద 3డీ ప్రింటెడ్ తామరపువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయంలోనే సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ సైతం ఉంది.
దుబాయ్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున మన దేశంతో ఉన్న అనుబంధాన్ని చాటుకునేలా యూఏఈ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన పాలరాతితో కట్టిన దేవాలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయాన్ని అనుమతులతో పాటు నిర్మాణంలోనూ యూఏఈ పాలకులు సహాయం అందించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా.. తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో దుబాయ్ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్, యూఏఈలోని భారత రాయబారి సంజయ్, వివిధ మతాల నాయకులు, యూఏఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.














