అమెరికాలో ఓ మహిళను అదృష్టం ఊహించని విధంగా వరించింది. ఆమె ఆడబిడ్డను ప్రసవించిన కొద్ది గంటలకే లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ లాటరీలో ఆమెకు ఏకంగా లక్ష డాలర్లు ఆమె సొంతమయ్యాయి. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ.81 లక్షలకు సమానం. నార్త్ కెరోలీనాకు చెందిన బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ ఇటీవల ఓ లాటరీ టిక్కెట్ కొన్నారు. కాంకార్డ్ నగరంలో గల ఓ క్విక్‌ట్రిప్ స్టోర్‌లో ఆమె టిక్కెట్ కొనుగోలు చేశారు. తన ఇద్దరు కొడుకుల పుట్టిన రోజు తారీఖు నెంబర్లతో ఉన్న టిక్కెట్‌ను ఆమె ఎంచుకున్నారు. ఆ తరువాత నవంబర్ 9న పురిటినొప్పులు మొదలవడంతో బ్రెండా ఆస్పత్రిలో చేరారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన లాటరీ టిక్కెట్ విషయాన్నే మర్చిపోయారు. అయితే.. బిడ్డను కన్న కొద్ది గంటలకు తాను లాటరీ గెలుచుకున్నట్టు బ్రెండా తెలుసుకుని తెగ సంబరపడిపోయారు. ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.














