సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన బతుకమ్మ పాటకు అద్భుత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పాటను అందంగా దృశ్యమానం చేశారు. ఇదిలా వుండగా ఈ సినిమాలోని ఓ పాటలో తెలుగు అగ్ర హీరో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు ఆ పాట ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురుచూశారు. ఈ గీతాన్ని విడుదల చేశారు. ఏంటమ్మా అంటూ తెలుగు పల్లవితో మొదలైన ఈ పాటలో సల్మాన్ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులేయడం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ లిరిక్స్ కలబోతగా ఈ పాట సాగింది. మధ్యలో వచ్చే ఈ రోజు వేడుకగా ఉంటుంది అనే తెలుగు చరణాలు ఆకట్టుకున్నాయి.

చెన్నై ఎక్స్ప్రెస్ లోని లుంగీ డ్యాన్స్ను స్ఫురిస్తూ ఈ పాట సాగింది. పసుపు అంగీ, తెలుపు లుంగీ ధరించి రామ్ చరణ్ చివర్లో వేసిన స్టెప్స్ హైలైట్గా నిలిచాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇద్దరు లెజెండరీ నటులతో కలిసి స్టెప్పులేయడం ఓ మధురానుభూతి అంటూ రామ్చరణ్ ఈ పాట గురించి ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
