ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు రాజవంశం అధికారికంగా ప్రకటించింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే లో మే 6వ తేదీన బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్‌లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు. కోహినూర్ లేని కిరీటంతనే పట్టాభిషేకానికి రాణి కెమిల్లా హాజరవుతారని వెల్లడైంది. వలసవాద పాలనకు సంకేతంగా, వివాదాస్పదంగా ఉన్న ఈ వజ్రంతో కూడిన కిరీటాన్ని ధరించడం తనకు ఇష్టం లేదని కెమిల్లా తెలిపారు. ఈ మేరకు వేరే వజ్రంతో కూడిన కిరీటంతోనే ఆమె ఈ ఉత్సవానికి వస్తారని వెల్లడించారు. ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవానికి 2వేల మందిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆహ్వానాలు పంపనున్నట్లు రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి.















