ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లను తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున కీరవాణి, చంద్రబోస్‌లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఆస్కార్ గెలుపొందడానికి దర్శకుడు రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్ ఎంతగానో కృషి చేశారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆస్కార్ స్వీకరించిన సందర్భంలో నా భావోద్వేగాలు ఎలా ఉన్నాయని చాలా మంది అడిగారు. నా సినీ ప్రయాణంలో నేను ఎన్నో జయాపజయాల్ని చూశాను. పడిలేచిన రోజులున్నాయి. అందుకే ఆస్కార్ స్వీకరించిన క్షణంలో ప్రశాంతచిత్తంతోనే ఉన్నాను. ఎలాంటి ఉద్వేగానికి గురికాలేదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే నాటు నాటు పాట అవార్డు గెలుచుకోగలిగిందని భావిస్తున్నా. ఈ అవార్డు సమిష్టి కృషికి దక్కిన విజయంగా భావిస్తున్నా అన్నారు.

చంద్రబోస్ మట్లాడుతూ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం నాకు ఓ అబద్ధం లాంటి నిజం. స్వప్నం లాంటి సత్యం. ఊహలాంటి వాస్తవం. ఓ కల్పన లాంటి యథార్థం. దానిని సాధ్యం చేసిన రాజమౌళి బృందానికి కృతజ్ఞతలు. ఆస్కార్ పొందిన సంతోషాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో నా పాటల ప్రయాణంలో తోడుగా ఉన్న వారందరిని ప్రత్యక్షంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను. ఆస్కార్ పురస్కారాన్ని పట్టుకోగానే భారత సాహిత్య కీర్తి పతాకాన్ని చేతిలో తీసుకున్న ఆనందం కలిగింది. నమసే అనే తెలుగు పదాన్ని ఆస్కార్ వేదిక మీద నుంచి పలకడంతో నా జీవితం ధన్యమైందనే భావన కలిగింది అన్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బాహుబలి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సాధించాలంటే తనతోనే సాధ్యమని రాజమౌళి నిరూపించారు. నేడు ఆర్‌ఆర్‌ఆర్ తో తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలుపొందడం తెలుగువారందరికి గర్వకారణం. తెలంగాణ ఏర్పాటైన దగ్గరి నుంచి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలను అందిస్తున్నది.భవిష్యత్తులో కూడా అండగా ఉంటుంది అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సినీ ఇండస్ట్రీ ఏమైపోతుందోననే భయాలుండేవి. కానీ నేడు అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ప్రభుత్వమే పరిశ్రమకు ఎక్కువగా చేయూతనిస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజశేఖర్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్‌రాజు తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.














