ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అగ్ర రాజ్యం అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున కొట్టుమిట్టాడుతోందా? అంటే, అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటికిప్పుడు డెబిట్ సీలింగ్ పెంచుకోవడం ( రుణ గరిష్టపరిమితి) ఒక్కటే మార్గమని ఆ దేశ ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు. కొత్తగా అప్పులు చేసేందుకు వీలుగా డెబిట్ సీలింగ్ పెంపునకు చట్టసభలు ఆమోదం తెలిపితేనే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని తెలిపారు. అమెరికా దివాళా తీస్తే, ఆ ఒక్కో దేశమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావాల్సి వస్తుంది. కాబట్టి అమెరికా రుణ పరిమితి పెంపునకు ఆ దేశ చట్టసభలు ఆమోదం తెలపడం ఇప్పుడు చాలా అత్యవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.