హీరో రానా దగ్గుబాటి శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా తన కొత్త చిత్రం హిరణ్యకశ్యప ని ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశ్యపునిగా రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ టైమ్‌లెస్ లెజెండ్స్ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు. తాజాగా అమెరికాలోని శాండియాగోలో ప్రమోషన్‌లో భాగంగా రానాకు సంబంధించిన హిరణ్యకశ్యప పోస్టర్‌ను విడుదల చేసారు. ఇందులో రాక్షసుడిగా రానా గెటప్ బాగుంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అమర చిత్ర కథల స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించే అవకాశం ఉంది.
