తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు చేపట్టిన ఆందోళనల ఉధృతి కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అరబ్ దేశాలు ఇలా ప్రవాసాంధ్రులు ఎక్కడుంటే అక్కడ రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా కదంతొక్కారు. ఎక్కడికక్కడ వందల సంఖ్యలో తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. యువత, వృద్ధులు, పిల్లలు ఆందోళనల్లో పాల్గొంటూ చంద్రబాబు వెంటే మేమంతా, వియ్ ఆర్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు హ్యూస్టన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి స్వచ్ఛందంగా నిరసన తెలిపారు. లండన్‌లోనూ నిరసనలు హోరెత్తాయి. భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఆందోళనకు దిగారు.














