Skip to main content

Namaste NRI

 సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో  వినాయక  చవితి వేడుకలను స్థానిక పీజీపీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. గణపతి నామ జయజయద్వానాల నడుమ ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆద్యాత్మిక శోభతో అత్యద్భుతంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యంగా సుమారు 100 మంది బాలబాలికలు వారి స్వహస్తాలతో అరుదైన 21 పత్రాలతో బాలగణపతి పూజ చేసి వినాయక చవితి విశిష్ఠతను, సంప్రదాయాన్ని తెలుసుకొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. వేలం పాటలో వీర గ్రూపు లడ్డును దక్కించుకుంది.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని,  సుమారు 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచి పెట్టామని తెలిపారు. ఇది తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. అందరూ సమాజం నిర్వహించే కార్యక్రమాలకు చేయూతనిస్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మునుముందు మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలు రూపొందిస్తూన్నామని, సభ్యులు కూడా ఆదరించాలని కోరారు.

కార్యక్రమ నిర్వాహకులు ఆలపాటి రాఘవ అందరికీ ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశంతో నిర్వహించిన పూజా కార్యక్రమానికి సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించడం జరిగిందని తెలిపారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గ సభ్యులకు, దాతలకు, పూజా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వచ్ఛంద సేవకులకు కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News