అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడికి భద్రత కల్పించే సీక్రెట్ సర్వీస్ విభాగం లోని ఓ సభ్యుడిని కొందరు దొంగలు దోచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రెసిడెంట్ జో బైడెన్ కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా ఈ ఘటన వెలుగు చూసింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి గత వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులతోపాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం అధ్యక్షుడి భద్రతను చూసుకుంది. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న ఓ సీక్రెట్ ఏజెంట్‌ను కొందరు దుండగులు దారిలో అడ్డగించి దోచుకున్నారు. టూస్టిన్ అనే ప్రాంతంలో తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లి పోయారు. ఈ ఘటనను సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెమొనీ ధ్రువీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ ఏజెంట్ తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేసినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.















