కెనడా ప్రధాని పదవికి తాను పోటీ పడటం లేదని ఆ దేశ రవాణాశాఖ మంత్రి, భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఓక్విల్లే పార్లమెంట్ స్థాన సభ్యురాలిగా ఎన్నికవ్వాలని కోరుకోవడం లేదని తెలిపారు. అయితే తదుపరి పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకూ కొనసాగుతానని చెప్పారు.
కెనడా ప్ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతోపాటు అధికార లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఐదుగురు నేతల్లో అనితా ఆనంద్ ఒకరు. ఒక పార్లమెంట్ సభ్యురాలిగా క్యాబినెట్లోకి తీసుకుని కీలక మంత్రి పదవులు అప్పగించినందుకు ప్రధాని జస్టిన్ ట్రూడోకు, తనను ఎన్నుకున్న ఓక్విల్లే ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో విద్యారంగంలో సేవలు అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
దేశానికి, సమాజానికి మనం పలు విధాలుగా సేవ చేయొచ్చు. ఎంపీగా కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి చేయాల్సిందంతా చేశాను. నేను పుట్టక ముందు వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఈ దేశ గొప్పదనాన్ని, మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కనుక మా లిబరల్ టీం కోసం, ఓక్విల్లే కోసం, అన్నింటికంటే కెనడా కోసం నేను ఇక్కడే ఉంటాను’అని అనిత తెలిపారు.