రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందికి లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆ విభాగాల సిబ్బంది అందరినీ సెలవులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో ట్రంప్ కార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.
బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు వారందరినీ వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీ లకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా పూర్తిగా తొలగించాలని ఉత్తర్వుల్లో ట్రంప్ కార్యవర్గం స్పష్టం చేసింది. అంతేకాకుండా డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను కూడా తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించింది. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా క్యాన్సిల్ చేయాల ని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను అధికారులు తొలగించారు.