అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు మధ్య చిచ్చును మరింత రాజేస్తున్నది. ఈ బిల్లుపై ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే ఆ మరుసటి రోజే దేశంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.

దీనిపై స్పందించిన ట్రంప్ తాము ఇస్తున్న సబ్సిడీలకు కోత విధిస్తే మస్క్ తన దుకాణం మూసుకొని తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే తన సబ్సిడీలకు కోత విధించాలని మస్క్ సవాల్ చేశారు. ఇప్పుడు గనుక ఆ బిల్లు ఆమోదం పొందితే బిల్లుకు మద్దతునిచ్చిన సెనేట్ సభ్యులందరినీ వచ్చే ఎన్నికల్లో పదవీచ్యుతులను చేస్తానని బెదిరించారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే అమెరికన్ పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.















