హీరో ఆదిత్య ఓం దర్శకత్వంలో 17వ శతాబ్దపు మరాఠీ సాధువు సంత్ తుకారామ్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీ నటుడు సుభోద్ భావే టైటిల్ రోల్‌ని పోషించారు. సంత్ తుకారామ్ జీవితంలోని భక్తి, ప్రతిఘటన, విప్లవం వంటి అంశాలను చర్చిస్తూ ఆయన తాత్విక పరిణామ క్రమాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామని, ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ఓవర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆదిత్యం ఓం తెలిపారు. మరాఠీ, హిందీ భాషల్లో జూలై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, డిజే అక్బర్ సామి వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రలకు జీవం పోశారు. నిఖిల్ కామత్, రవి త్రిపాఠి, వీరల్, లావన్ స్వరపరిచిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని, శాస్త్రీయ, జానపద, భక్తి భావాల్ని కలిగించేలా పాటలు ఉండబోతున్నాయని ఆదిత్య ఓం చెప్పారు. ప్రతి పాట తుకారాం పాత్ర భావోద్వేగ, తాత్విక పరిణామాన్ని ప్రతిధ్వనిస్తుందని ఆయన అన్నారు. పురుషోత్తం స్టూడియోస్‌తో కలిసి బి. గౌతమ్‌కు చెందిన కర్జన్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది.















