టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి అధికారికంగా శ్రీకారం చుట్టుకుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో నటించబోయే కథానాయికలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వెంకీ మామకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోండగా,నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి సందడి చేయనుంది.

ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం వహిస్తున్నాయి.2027 సంక్రాంతి కానుకగా ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.





























