ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం అగధ. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాశీవిశాలాక్షి బసులు నిర్మాత. ఈ నెల 14న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో విలేకరులతో ఎమ్మెస్ రాజు ముచ్చటించారు. అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పొచ్చు. మనం దైవాన్ని, దెయ్యాన్ని కంటితో చూడలేం. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథే అగధ.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి నా గురించి ఓ మాట చెప్పారు. నాకు తెలిసిన ఎమ్మెస్ రాజు కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో మాత్రమే సినిమా తీయడు. ఇందులో చాలా అంశాలు ఉంటాయి అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఇందులో అన్ని రకాల అంశాలూ ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్టశక్తిని అగధగా చూపించాను. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి, ఓ ఆర్ట్ ఫిల్మ్‌గా కాకుండా జనరంజకంగా రూపొందించా. అగధ జర్నీలో ఏదో ఒక పవర్ ముందుండి నన్ను నడిపించినట్టు అనిపించింది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో టీజర్, ట్రైలర్‌లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ రెండింటికీ స్కోప్ ఉంది. రిలీజ్ తర్వాత వీటిలో ఏది ఉంటుందో చెబుతాను అని ఎమ్మెస్ రాజు తెలిపారు.















