ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించింది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. భారత్ అమెరికా యూకే సహా పలు దేశాల్లోని రిటైల్ బృందాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. రానున్న రోజుల్లో దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలనే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తాజా ఉద్యోగుల కోతలు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించే స్టోర్స్ వ్యాపార విభాగానికి చెందిన ఉద్యోగులను తాజాగా తొలగించినట్లు ప్రకటించింది. తమ ప్రాధాన్యతలను మెరుగ్గా చేరుకోవడానికి వీలుగా స్టోర్స్ బిజినెస్‌లో కొన్ని సర్దుబాట్లు చేశామని అమెజాన్ ప్రతినిధి ఒకరు వివరించారు. అయితే ఎంతమందిని తొలగించారనే కచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడమే ప్రస్తుత తొలగింపులకు కారణమని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అన్నారు.















