తెలుగు రాష్ట్రాల మధ్య అగ్నికి ఆజ్యం పోసిన కృష్ణా జలాల విషయం మరింత ముదిరిపోయింది. ఇదే విషయంపై ఏపీ సర్కార్ సుప్రీం మెట్లెక్కింది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా జలాల్లో తమకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను తెలంగాణ తమకు రానివ్వకుండా అడ్డుకుంటోందని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. శ్రీశైలం ప్రాజెక్టులో అతి తక్కువ నీరున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ సర్కార్ తన పిటిషన్‌లో పేర్కొంది. దీని ద్వారా ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం చేస్తోందని వాదించింది. ఏపీ ప్రజల జీవించే హక్కును అణచివేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం మండిపడింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను కృష్ణానది యాజమాన్య బోర్డు ఏమాత్రం అమలు చేయడం లేదని ఏపీ సర్కార్ సుప్రీంకు ఫిర్యాదు చేసింది.