అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు 2022 జులై 1 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్ డీసీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని ఆటా అధ్యక్షుడు భువనేష్ భూజాల వెల్లడిరచారు. మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డులు అందించనుంది. రెండోరోజు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాటు ఏశారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్దురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు.
మూడో రోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీనివాసుడి కల్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి అధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు. అదే విధంగా ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్‌కు తీసుకొస్తున్నారు. సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్, అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నారు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు.
ఆటా వేడుకలకు సినీతారాలు.. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరిణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు, ఎప్పటికీ మర్చిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు వివాహ వేదికలు, మాట ముచ్చట్లు, చెప్పుకుంటూ పోతే మూడు రోజులు వాషింగ్టన్ డీసీలో పండుగ వాతావరణం ఏర్పాటు కానుంది.














