కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ యువనేత బబూల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, తనను ఎవరూ సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. తాను సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని, అయితే సేవ చేయడానికి రాజకీయ రంగమే మాధ్యమం కాదన్న విషయాన్ని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఇతర రంగాల్లో ఉంటూ కూడా సేవ చేయవచ్చని పేర్కొన్నారు. అల్విదా… నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. పార్టీల్లోకి రమ్మని కూడా నన్నెవ్వరూ ఆహ్వానించలేదు. నేను ఒకే టీమ్ ప్లేయర్‌ను. బీజేపీలోనే ఉంటా. సుదీర్ఘ చర్చల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’’ అంటూ బబూల్ సుప్రియో అన్నారు.
2014 లో బబూల్ సుప్రియో బీజేపీలో చేరారు. అంతకు ముందు బెంగాలీలో ప్రముఖ గాయకుడిగా ఉన్నారు. అసన్‌సోల్ నుంచి 2014,19 ఇలా.. రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. అయితే తాజా కేబినెట్ విస్తరణ సందర్భంగా మోదీ బబూల్ సుప్రియోను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఈయన అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా కూడా బరిలో నిలిచారు. అయితే ప్రత్యర్థి తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.