అమెరికాలో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడింది. ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. విమాన ప్రమాదాల గురించి పైలట్‌లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరించే ఎయిర్ మిషన్ల నోటీసు వ్యవస్థ విఫలమైనట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) తెలిపింది. దీని వల్ల అమెరికా వ్యాప్తంగా గగనతలం వ్యవస్థ ప్రభావితమైనట్లు పేర్కొంది. ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించింది. విమానాశ్రయంలో సేవలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని వెల్లడించింది.
సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా 3,700 విమానాలు ఆలస్యంగా నడిచాయని, 600 విమానాలు రద్దయ్యాయని విమానయాన సంస్థ ఫ్టెట్ అవేర్ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ (ఎఫ్‌ఎఎ) అధికారులు ఎయిర్ మిషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు గుర్తించి దానిని పాక్షికంగా పునరుద్ధరించారు. ఎఫ్‌ఏఏలో సాంకేతిక వైఫల్యం గురించి పైలట్‌లు, ఇతర సిబ్బందిని ఇదివరకే అప్రమత్తం చేసినట్టు అధికారులు చెప్పారు. ఎయిర్‌పోర్టుల్లో ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోవడం, విమానాల రాకపోకల్లో ఆలస్యం వల్ల అమెరికా వ్యాప్తంగా విమాన ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు.














