వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి (శాప్)ని బైరెడ్డి సిద్థార్థ్ రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని సిద్దార్థ్ రెడ్డికి అప్పచెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు.
పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీని నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర, పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.