కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ మంత్రి సత్యవతీ రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉంటారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆజ్ఞాపించారు. వీటితో పాటు తెలంగాణలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, అలాగే ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
50 వేల వరకున్న పంట రుణాలు మాఫీ
ఆగస్టు 15 నుంచి 50,000 వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దాదాపు 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. గత రెండు సంవత్సరాలుగా 25,000 ఉన్న వారికి పంట రుణాలను మాఫీ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులపై కూడా కేబినెట్ చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని సూచించింది.