కొవిడ్ 19 కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటీటీలు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలిసి చేసేలా వెలిసిన అనేక ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. డిజిటల్ వేదికపైకి డ్యూడ్ అనే మరో ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ ఓటీటీని ఇటీవల హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. దర్శక నిర్మాత ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ ఓటీటీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ మా ఓటీటీ ద్వారా వివిధ విభాగాల్లో ఔత్సాహిక ప్రతిభావంతులను పరిచయం చేయాలనుకుంటున్నాము. కొత్త దర్శకులు, నటీనటులకు అవకాశాలు ఇవ్వబోతున్నాం. సినిమాలు , వెబ్ సిరీస్‌లు, గేమ్స్ స్పోర్ట్స్ లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్ ఇలా కొత్త తరహా కంటెంట్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు విష్ణు బొప్పన, బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట్ తదితరులు పాల్గొన్నారు.














