అమెరికాలో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో అమెరికా ఇంధనశాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో రేడియేషన్ లీకై ఉండవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి ని ప్రకటించారు. సౌత్కరోలినాలోని సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ గదిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయని వెల్లడించారు. అయితే రెండు గంటల్లోనే ఆ మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు.

ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లేబరేటరీ ప్రవేశమార్గాలను మూసివేసినట్లు తెలిపారు. సమీపంలో రాకపోకలను నిలిపివేశామని చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ల్యాబ్ మార్గాలను తెరుస్తామని, రాకపోకలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.















