సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తొలిసారిగా ఒక మహిళ న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్‌స్టిట్యూషనల్ లా, కమిర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్‌లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగల గుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ఏదైనా బ్రాడ్ కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లతో సంచలనాలను నిలిపివేయాలి అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టులో ఏర్పాటయ్యాక ఇప్పటిదాక కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియామితురాలైన తొలి మహిళ న్యాయమూర్తిగా రికార్డులెక్కారు.